అయ్యప్ప దర్శనానికి 250 మందే!
ఏడు నెలల అనంతరం తెరుచుకున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ శబరిమల దేవాలయం శనివారం తెరుచుకుంది. దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల పూజ కోసం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ..పలువురు దేవాలయాన్ని సందర్శించుకున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఏడు నెలల పాటు మూత పడ్డ..శబరిమల ఆలయం.. శుక్రవారం తెరుచుకుంది. అయితే శనివారం నుండి భక్తులకు అనుమతినిచ్చారు. ఆలయాన్ని సందర్శించే వారూ తప్పకుండా మాస్క్ ధరించాలని, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే ఆలయంలోకి అనుమతిస్తామని నిబంధనలు జారీ చేసింది. నెలవారీ పూజా కార్యక్రమంలో ఐదు రోజుల మాత్రమే దేవాలయం తెరుచుకుంటుంది. ప్రతి రోజూ కేవలం 250 మందికే అనుమతినిస్తున్నారు. శనివారం దేవాలయాన్ని దర్శించుకునేందుకు 240 మంది బుక్ చేసుకున్నారు.
ఇందులో భాగంగా ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమలలో దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కేరళలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున అయ్యప్ప కొంద మీద అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు.
కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన కేరళ
- కేరళ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వర్చువల్ క్యూలైన్ వెబ్సైట్లో ముందుగా భక్తులు నమోదు చేసుకోవాలి. వీరికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ విధానంలో దర్శనం కల్పిస్తారు. ప్రతి రోజు 250 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు..
- దర్శన సమయానికి 48 గంటల ముందుగా భక్తులు తమకు కరోనా లేదని తెలిపే నెగిటివ్ సర్టిఫికెట్‌ను చూపాలి. ఇందుకోసం దర్శనానికి అనుమతించే ప్రదేశాల్లో నిర్ణీత ధరకు యాంటీజెన్ టెస్టులను చేస్తారు.
- 10 ఏళ్ల లోపు పిల్లలను, 60–65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనాలకు అనుమతించరు. రేషన్‌కార్డు వంటి గుర్తింపు కార్డులను భక్తులు తమ వెంట తెచ్చుకోవాలి.
- శబరిమల ఆలయంలో నెయ్యాభిషేకానికి, భక్తులు పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతుల్లేవు. ప్రత్యామ్నాయంగా పంబా వంద షవర్లు ఏర్పాటు చేశారు. సన్నిధానం, పంప, గణపతి ఆలయాల్లో రాత్రిళ్లు ఉండటానికి అంగీకరించరు. భక్తులు ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే శబరిమలకు చేరుకోవాలి.