ఆర్థికశాఖకు ఖాళీల జాబితా!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై కసరత్తు వేగంగా జరుగుతోంది. దాదాపు 50 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, ఈ మేరకు ఖాళీ పోస్టుల జాబితా రూపొందించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్ అన్నిశాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థికశాఖకు అందించాలని ఆదేశించారు. కార్పొరేషన్లలో ఉన్న ఖాళీల వివరాలను కూడా అందించాలని సూచించారు. ఈ మేరకు ఆయాశాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థికశాఖకు అందజేస్తున్నారు. విద్య, హోంశాఖలలో ఎక్కువగా ఖాళీలున్నట్టు సమాచారం. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు కలిసి దాదాపు 200 వరకు సంస్థలున్నాయి. వీటిల్లో కూడా చాలా ఏండ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఆయా సంస్థల్లో చాలావరకు ఖాళీలున్నాయి. ఈ ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తే మంచిదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకు ఆయాసంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది.
సీఎం కేసీఆర్‌కు త్వరలో నివేదిక
ఆయా వివరాలన్నిటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించనున్నట్టు తెలిసింది. వీటి ఆధారంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆమోదించిన వెంటనే వరుసగా ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నది. కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. గిడ్డంగులు, విత్తనాభివృద్ధి, టెస్కో, అటవీ అభివృద్ధి, పౌరసరఫరాలు, ఖనిజాభివృద్ధి, బేవరేజెస్, పాడిపరిశ్రమ, ఆగ్రోస్, వర్సిటీలు, గొర్రెలు, మేకల అభివృద్ధి, తెలంగాణ ఫుడ్స్ తదితర సంస్థల్లో ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.