ఆ కారు నా కుమారుడిది కాదు: మంత్రి

కర్నూలు : టీడీపీ సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు తీవ్రంగా ఖండించారు. తనపై అనాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై మంత్రి మండిప‌డ్డారు. అయ్యన్న పాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్‌ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల పక్కిర్ లాంటివారని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.