ఇంకెంతమంది రైతులు బలవ్వాలి: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి సర్కార్ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఇంకా ఎంతమంది రైతులు తమ ప్రాణాలను త్యాగం చేయాలని కోరుకుంటున్నారని నరేంద్రమోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కార్పోరేట్లకు దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నవంబర్ 26 నుండి రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరసన ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 11 మంది రైతులు మృత్యువాతపడ్డారని, ఇంకెంత మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. అనారోగ్యం, చలి తీవ్రత, ఇతర కారణాల వలన నిరసనలో పాల్గన్న 11 మంది రైతులు మరణించారని అన్నారు. గత 17 రోజుల్లో 11 మంది రైతు సోదరులు బలి అయినప్పటికీ.. మోడీ ప్రభుత్వానికి పశ్చాత్తాపం కలగడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికీ నగదు సరఫరా చేసేవారి (కార్పోరేట్ల) వైపే ఉంది కాని.. అన్నదాతల వైపు లేదని మండిపడ్డారు. రాజధర్మం జయిస్తుందా… లేదంటే మూర్ఖత్వం జయిస్తుందా అనేది దేశం యావత్తూ తెలుసుకోవాలనుకుంటోందని అన్నారు.