ఇంటి వద్దే ఈద్ ప్రార్ధనలు

రేపు రంజాన్ పండుగ.. తూర్పు గోదావ‌రి జిల్లావ్యాప్తంగా కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు

 రంజాన్ ముస్లిం లకు ఏడాదికోసారి వచ్చే పెద్ద పండుగ. నెలరోజులుగా ఉపవాసాలు ఆచరించిన ముస్లిం లు ఎంతో ఆనందంగా రంజాన్ ను నిర్వహించడం ఆనవాయితీ. కరోనా మ‌హమ్మారి వల్ల గత ఏడాది కేవలం ఇళ్లకు పరిమితమై రంజాన్ పండుగ ఈద్ ఉల్ పీతర్ ప్రార్ధనలు నిర్వహించారు. గత ఏడాది కంటే భయానక పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఈద్ ప్రార్ధనలు ఇళ్లకు పరిమితమై నిర్వహించేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు.

గ‌తంలో లాగా పండుగ ల షాపింగ్ లేదు. కుటుంబల్లో ఆ ఆనందాలు కనబడటం లేదు. ప్రస్తుతం సమాజంలో ఉన్న విపత్కర పరిస్థితి కి అనుగుణంగా ముస్లిం మతస్తులు క్రమశిక్షణ పాటిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట తదితర ప్రాంతాల్లో నిదారంబరంగా రంజాన్ నిర్వహించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలనుకుంటున్న రంజాన్‌ ప్రార్థనలను నిషేధించారు. జమాత్‌ (సమూహం) 50మందికి మించికుండా కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈద్‌ ప్రార్థనలు జరుపుకోవాలని వక్ఫ్ అధికారులు సూచించారు. ఇంటి వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఈద్‌ ప్రార్థనలను నిర్వహించడం శ్రేయస్కరమని భావించి ఎక్కువగా ఇళ్లకే పరిమితం కానున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు, చేతి తొడుగులు ధరించి ప్రార్ధనలు చేయాలి. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో, శానిటైజర్‌తో  శుభ్రపరుచుకోవాలని ఆయా మసిద్ కమిటీలు సూచించాయి.

ఈద్గాలు, మసీదుల పరిసరాల్లో ఉమ్మి వేయరాదని, ముస్లిం సోదరులు ఆచరించే కరచాలనాలు, ఆలింగనాలకు ఈ ఏడాదికి విరామం ప్రకటించాలని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి మసీదులో ప్రవేశం నిషేధించాలని చెప్పారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు, హృద్రోగ సమస్యలు.. ఇతర దీర్ఘకాల సమస్యలు ఉన్నవారిని కూడా అనుమతించకూడదని నిర్ణయించారు.

-న‌ల్లా వెంక‌ట్రావు
CLiC2NEWS ప్ర‌తినిధి, మండ‌పేట

Leave A Reply

Your email address will not be published.