ఇండోనేషియాలో తొలి టీకా తీసుకున్న అధ్యక్షుడు!

జకార్తా : ఇండోనేషియాలో కరోనా తొలి వ్యాక్సిన్ దేశాధ్యక్షుడు జోకో విడోడో బుధవారం తీసుకున్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు అధ్యక్షుడి తరువాత మిలటరీ ఉన్నతాధికారులు, పోలీసులు, ఆరోగ్యాధికారులు వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఇండోనేషియాలో చైనీస్ వ్యాక్సిన్ సినోవాక్ బయోటెక్‌కు అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇండోనేషియన్ ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి వ్యాక్సిన్‌ను తీసుకున్న తరువాత ఈ వ్యాక్సిన్‌ను ముస్లింలు అందరూ తీసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గుణాదిసాదికిన్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకుంటేనే వైరస్‌ను అదుపు చేయగలమన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం అనేది కేవలం మన కోసమే కాదని, మన చుట్టూ ఉన్న కుటుంబం, సన్నిహితులు, స్నేహితుల కోసమని తెలిపారు.