ఏపీ మంత్రి పేర్నినాని పై దుండగుడి దాడి

మచిలీపట్నం: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు… తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు… ఆ దుండగుణ్ని పట్టుకొని… బలవంతంగా నిలువరించారు. మంత్రి అనుచరులు బలంగా పట్టుకొని అతన్ని వెనక్కి నెట్టి… తాపీ లాక్కున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. మొత్తానికి ఈ దాడి నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నాడు, మంత్రిని చంపేయాలనేంత కసి ఎందుకు పెంచుకున్నాడు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్పందించిన పేర్ని నాని
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… ‘ఈ రోజు అమ్మ పెద్దకర్మ ఉండటంతో పూజాదికాలు పూర్తి చేసుకొని కార్యక్రమానికి వచ్చిన ప్రజలను పలకరిస్తున్నాను. ఇదే క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ భోజనాల దగ్గరకు వెళ్తూ.. గేటు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో నా మీద దాడికి ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో నాకు ఎలాంటి గాయం కాలేదు. అది బెల్ట్‌ బకెల్‌కి తగలడంతో నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిందితుడు మరోసారి దాడికి ప్రయత్నించగా అప్రమత్తమైన చుట్టూ ఉన్నవారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నేను క్షేమంగానే ఉన్నాను ఏమీ జరగలేదు’ అని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.