కదులుతున్న లారీలో నుంచి సెల్‌ఫోన్లను ఎలా కొట్టాశారంటే!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన గుంటూరు చెన్నై జాతీయ రహదారిపై నడుస్తున్న కంటెయినర్‌లో సెల్‌ఫోన్ల చోరీ ఘటనా కేసును గుంటూరు అర్బన్ పోలీసులు ఛేదించారు. ఆదివారం ఉదయం గుంటూరు పోలీసులు అధికారులు చోరీ కేసు విరాలను మీడియాకు వివరించారు.. ముందుగా ఊహించినట్టే ఈ దొంగతనం కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రమాదకరమైన కంజరభట్ గ్యాంగ్ ల పనేనన్నారు. ఆ గ్యాంగ్ ఎన్నోసార్లు ట్రైనింగ్ పొంది రిక్కీ చేసి సెల్‌ఫోన్లు, కాస్ట్‌లీ చీరలు, స్పైసెస్, మెడిసన్స్ లాంటి వాటిని ట్రాన్స్‌పోర్ట్ చేసే కంటెయినర్స్‌ని జాగ్రత్తగా ఫాలో అవుతూ టూవీలర్ సాయంతో కంటెయినర్ వెనుకనే వెళుతూ కంటెయినర్ సీజ్‌ను కట్ చేసి అత్యంత చాకచక్యంగా లోపలికి ప్రవేశించి సరుకును మూటల రూపంలో కట్టుకుంటారని తెలిపారు. సరుకును బయటకు విసిరేయడం కానీ నిచ్చెన సాయంతో వెనుక వస్తున్న వాళ్ల లారీలోకి ట్రాన్స్‌ఫర్ చేయడం కానీ చేస్తున్నారని అన్నారు. వెళుతున్న వాహనంలో నుండి కిందికి దిగడానికి నడుముకి టైర్లను చుట్టుకొని ఆ టైర్లతో పాటు వాళ్లు కిందికి దూకేస్తారని వివరించారు. ఘటనా విషయం తెలియగానే గుంటూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. వేర్వేరు టెక్నికల్ ఎవిడెన్స్‌ల ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న సరుకునంతటినీ, వాహనాలను స్వాధీనపరుచుకున్నామన్నారు. నిందితులను విచారించగా, ఈ రెక్కీలో పాల్గొన్నది మొత్తం 11 మందిగా తెలిసిందన్నారు. వీరిలో ముఖ్యులు ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. వీరిని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచనున్నామని చెప్పారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కంటెయినర్‌లో రూ.81 లక్షల సరుకు పోతే, రూ.76 లక్షల సరుకును రికవరీ చేయగలిగామన్నారు. ఈ దొంగతనం తర్వాత నిందితులు వెళుతూ హైదరాబాద్ శివారులో చేగుంట పోలీస్ స్టేషన్ మెదక్ జిల్లాలో ఇలాంటి మరో ఘటనకు పాల్పడ్డారని అన్నారు. అందులో సుమారు రెండున్నర కోట్ల రూపాయల ప్రాపర్టీని దొంగిలించారని చెప్పారు. అందులో రూ.2.1 కోట్లను కంబైండ్ రికవరీగా రాబట్టి తెలంగాణ పోలీసులకు అప్పగించామన్నారు. నిందితులను పట్టుకునే విషయంలో కృషి చేసిన ఎడిషనల్ క్రైం, డిఎస్‌పి క్రైం, డిఎస్‌పి సౌత్ సబ్‌డివిజన్, ఇన్స్‌పెక్టర్ క్రైమ్స్ వాసు, ఎస్‌హెచ్‌ఒ నల్లపాడు వీరాస్వామి, ఎస్‌ఐ అనువర్థన్, ఎస్‌ఐ రవీందర్, సిబ్బంది లను అభినందించారు.