కరోనాతో ప్రతి 17 సెకన్లకు ఒకరు మృతి..!

హైదరాబాద్: కరోనా కల్లోలం.. వైరస్ పోయింది అని అందరూ లైట్ తీసుకున్నారు. పలు దేశాల్లో కరోనా వణుకుపట్టిస్తోంది. ఈ మహమ్మారికి చలికాలం తోడు కావడంతో వైరస్ విజృంభిస్తోంది. దాంతో ఐరోపాలో మరోసారి భయానక పరిస్థితులు దాపురించాయి. యూరోపియన్ యూనియన్లో ప్రతి 17 సెకన్లకు ఒక వ్యక్తి మృతిచెందుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఈయూ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ క్లుగే ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా 28 శాతం కేసులు, 26 శాతం మరణాలు ఈ ప్రాంతంలోనే నమోదవుతున్నట్టుగా చెబుతున్నారు.
కోవిడ్ తాజా కేసులు, మరణాలపై హాన్స్ క్లుగే మాట్లాడుతూ.. గతవారం 29 వేల కొత్త పాజిటివ్్ కేసులు నమోదు కాగా.. ప్రతీ 17 సెకన్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడని వెల్లడించారు. కోవిడ్ మరణాల సంఖ్య గత వారం రోజుల్లో 18 శాతం పెరిగినట్టు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గత 3 నెలల కాలంలో తొలిసారిగా ఈ వారం కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించిందన్నారు. కొత్త కేసులు 10 శాతానికి తగ్గిన నేపథ్యంలో.. యూకే, ఫ్రాన్స్, స్పెయిన్లో విధించిన లాక్డౌన్ మంచి ఫలితాలు ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇక, డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్లో 15.7 మిలియన్ల కరోనా కేసులు నమోదు కాగా.. 3.55 లక్షల మంది కరోనాతో మృతిచెందారు.