కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్న కెసిఆర్
ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ నెగెటివ్... సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యుల వెల్లడి

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం మంగళవారం ముఖ్యమంత్రికి ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ యాంటిజెన్‌తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. బుధవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనవచ్చని వైద్యుల బృందం సూచించింది. గత నెల 14న సిఎంకు పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు.
కరోనా నుంచి కోలుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం హైదరాబాద్‌కు వచ్చే వీలుంది. ఆ వెంటనే ఆయన వైద్య ఆరోగ్యశాఖ సమావేశం నిర్వహించనున్నారు. ఈటల రాజేందర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాక సిఎం ఆ శాఖను తన పరిధిలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ ద్వారానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా కరోనా స్థితిగతులు, టీకాలు, పరీక్షలు, ఔషధాలు, కిట్లు, వైద్య సిబ్బంది తాత్కాలిక నియామకాలు, ఆక్సిజన్ సరఫరా రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల లభ్యత తదితర అంశాలపై సిఎం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.