కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్‌కు సూటిప్రశ్న

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని గురువారం ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేర‌కు కరోనా వైరస్‌కు సంబంధించిన పిటిష‌న్ల‌పై తెలంగాణ అత్యున్న‌త న్యాయ‌స్థానం గురువారం విచారణ చేపట్టింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని మరో మారు ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ఆదేశించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలంది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ రావు తండ్రి కరోనాతో మరణించినందున నివేదిక సమర్పించేందుకు గడువు సమయం ఇవ్వాలని ఏజీ కోరగా.. హైకోర్టు విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. గురువారం అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.