కరోనా లక్షణాలున్న వ్యక్తి విధులకు.. వైరస్ సోకి ఏడుగురు మృతి

వాషింగ్టన్: అమెరికాలో కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆఫీస్‌లోని కొందరికి వైరస్ సోకడంతో ఏడుగురు మరణించారు. క్వారంటైన్‌లో ఉన్న సుమారు 300 మంది ప్రాణ భయంతో హడలిపోతున్నారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. డగ్లస్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ గత వారం ఆఫీస్‌కు వెళ్లి విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో అతడ్ని పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు అతడి ద్వారా మరికొందరికి వైరస్ వ్యాపించింది. ఈ క్రమంలో కరోనాబారినపడి ఏడుగురు మరణించారు. దీంతో డగ్లస్ కౌంటీలోని సుమారు 300 మందికిపైగా ప్రజలు స్వీయ క్వారంటైన్ విధించుకున్నారు.