కాంగ్రెస్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత… ప్రియాంక అరెస్టు

ఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా పలువురు నేతలు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. అయితే, వీరిని పార్టీ కార్యాలయం ఎదుటే పోలీసులు అడ్డుకున్నారు. కేవలం అనుమతి ఉన్నవారిని మాత్రమే రాష్ట్రపతిభవన్‌కు వెళ్లనిస్తామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ర్యాలీకి అనుమతించకపోవడంతో ప్రియాంకగాంధీ సహా పలువురు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వారిని నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ.. ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘ప్రభుత్వానిది అహంకారపూరిత ధోరణి అని, రైతులకు, జవాన్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు.