కేంద్ర వరద సాయం రూ.224.50 కోట్లు
త్వరలో విడుదల చేయనున్నకేంద్రం

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న తెలంగాణకు తక్షణ సాయంగా రూ.224.50 కోట్లు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నుంచి ఈ మొత్తాన్ని అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు కోల్పోయిన వారికి, ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించాలని నిర్దేశించింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో విడుదల చేయాల్సి ఉన్నా.. పునరావాస పనులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, నిధుల ఆవశ్యకతను వివరించేలా ప్రత్యేక నివేదిక పంపారు. నిబంధనల ప్రకారం 2021 ఫిబ్రవరి, మార్చిలో ఈ నిధులు విడుదల కావాల్సి ఉండగా… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని, అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు. కాగా, నిధుల విడుదలకు అంగీకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.