కొత్తరకం కరోనాపై ఆందోళన అవసరం లేదు: సిసిఎంబి

హైదరాబాద్‌: భారత్‌లోకి ప్రవేశించిన కొత్త రకం కరోనా వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిసిఎంబి పేర్కొంది. అయితే జాగ్రత్తలు పాటించడం అవసరమని ఆ సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఇది చూడడానికి కొత్తగా కనిపించినప్పటికీ, ఇదీ కరోనా వైరస్‌ కావడంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్షణాలు, తీవ్రత ఒకే రకంగా ఉంటాయని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అయితే కొత్త రకం వైరస్‌ వ్యాప్తి వేగంగా, అధికంగా జరుగుతుందని వెల్లడించారు. భారత్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని, చేతులను సబ్బుతో వీలైనన్ని ఎక్కువసార్లు కడుక్కొవాలని సూచించారు. కాగా యూకే నుంచి భారత్‌ వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన 40 మంది శాంపిళ్లను సిసిఎంబి విశ్లేషిస్తోంది. ఇప్పటి వరకు 20 శాంపిళ్ల విశ్లేషణ పూర్తయిందని, వారిలో ముగ్గురికి కొత్త రకం వైరస్‌ ఉన్నట్లు తేలిందని రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.