కొవిడ్ ఓ ప్రపంచ యుద్ధం.. దావాగ్నిలా వ్యాపిస్తోంది: సుప్రీం

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ మార్గదర్శకాల అమలులో లోపాల కారణంగా దేశంలో కొవిడ్ దావాగ్నిలా వ్యాపిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది. కొవిడ్ – 19పై ప్రపంచ యుద్ధం జరుగుతోందని, ఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు (శుక్రవారం) విచారణ జరిపింది. మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోవడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జారీ చేయకపోవడం వల్ల మహమ్మారి వేగంగా విస్తరించిందని కోర్టు అభిప్రాయపడింది. కొవిడ్ వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారని వ్యాఖ్యానించింది. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లాంటి నిర్ణయాలను అమలు చేసేటప్పుడు చాలా రోజుల ముందే ప్రకటన చేయాలని, దీనివల్ల ప్రజలు అందుకు తగినట్లు తమ జీవనోపాధిని మలచుకుంటారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలో కరోనాపై యుద్ధం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు 8 నెలలుగా నిర్విరామంగా పని చేస్తూ పూర్తిగా అలసిపోయారని, వారికి మధ్యమధ్యలో విశ్రాంతినిచ్చేలా ఓ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించింది. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రతి రాష్ట్రం అప్రమత్తంగా ఉంటూ కేంద్రంతో కలిసి పని చేయాలని సూచించింది.
Comments are closed.