కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని గండి రామన్న హరితవనంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్, మూషిక జింకల పార్కును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రెండవ, దక్షిణ భారత దేశంలోనే తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ అని సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. దశల వారీగా గ్రామ పంచాయతీల సహకారంతో కోతులను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారని, అవి పూర్తిగా కోలుకున్నాకా మళ్ళీ అడవుల్లో వదిలేస్తారని వెల్లడించారు. పర్యావరణ సమతుల్యత ద్వారానే మానవజాతి మనుగడ సాధ్యమనే నమ్మి అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో తీసుకుంటున్నామని, పూలచెట్లు, పండ్ల చెట్లు, నీడ చెట్లు, జౌషధ మొక్కలను విరివిగా నాటుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, జెడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి రెడ్డి, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడె తదితరులు పాల్గొన్నారు.