కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలి..
అంబాజీపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కోనసీమ జిల్లాకు జిఎంసి బాలయోగి కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన ఆశయ సాధన సమితి కన్వీనర్ కర్రి రామస్వామి (దత్తుడు), సభ్యులు అరిగెల బలరామమూర్తి, టీవీ గోవిందరావు (న్యాయవాది, ఈతకోట) సాధనాల చక్రపాణి(మండపేట) డిమాండ్ చేశారు. గురువారం అంబాజీపేట లో జరిగిన బాలయోగి ఆశయ సాధన సమితి సమావేశంలో వారు మాట్లాడారు. కోనసీమ కు ఒక ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా తీసుకువచ్చింది గంటి మోహనచంద్ర బాలయోగి మాత్రమేనని వారు తెలిపారు. న్యాయవాది నుండి జిల్లా పరిషత్ చైర్మన్ గా.. ఎంపీగా.. శాసనసభ్యునిగా.. రాష్ట్ర మంత్రిగా.. లోక్ సభ స్పీకర్ గా దేశానికి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన గంటి మోహనచంద్ర బాలయోగి చిన్నవయసులోనే పరమపదించడం మాకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఆయన పేరుమీద జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వివరించారు. కోనసీమ జిల్లాగా ఈ రెండు పేర్లు కలిసి వచ్చేలా నామకరణం చేస్తే ఈ జిల్లాకు ఎనలేని గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో నాయకుల పేరున జిల్లాలు ఏర్పాటు చేయడం ఆది నుండి జరుగుతుందన్నారు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మామ గారైన కొండా వెంకట రంగారెడ్డి పేరుమీద రంగారెడ్డి జిల్లా ప్రప్రథమంగా ఏర్పాటయింది అన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా ఏర్పాటు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బాలయోగి దళితులపై కాకుండా అన్ని వర్గాలకు అంబేద్కరిజం తోపాటు ప్రజలు అందరూ సమానంగా ఉండాలని అందరికీ సాంఘిక న్యాయం కావాలని పరితపించే వారన్నారు. ఢిల్లీలో ఉండాల్సిన నాయకులు కోనసీమలో గల్లీలో ఉండి ప్రజల కష్టసుఖాలను పంచుకుని వెంటనే పరిష్కారం చూపే వారున్నారు. కోనసీమలో అనేకమంది నాయకులను తయారు చేసి వారికి ఎన్నో అవకాశాలు కల్పించిన యోగిపుంగవుడు అని వారు కొనియాడారు. కోనసీమ బాలయోగి జిల్లాలోని కోనసీమకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వస్తుందని వారు తెలిపారు.