జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండా సమీపంలోని బస్టాండ్ నుంచి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్ పోసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాపూర్ తండాకు చెందిన భూక్యా స్వాతి, అదే మండలంలో డబ్బా గ్రామానికి చెందిన రవితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. స్వాతి భర్త రవి ఆరు నెలల కిందట చనిపోయాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వాతి పుట్టింటికి వెళ్లింది. ఇవాళ పనిమీద మెట్పల్లి వెళ్లిన స్వాతి సాయంత్రానికి తండా బస్టాండ్ చేరుకుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుండగా హెల్మెట్ ధరించి ఉన్న గుర్తు తెలియని దుండగుడు ఆమె ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో ఆమె ముఖం కుడి భాగం కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన మెట్‌పల్లి ప్రైవేట్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఎస్పీ సింధూశర్మతో ఫోన్‌లో మాట్లాడి బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. నిందితుడిని త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన మెట్‌పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు.