జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్!
నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలో సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా మంత్రులు అందుబాటులో లేకపోతే జిల్లా ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరేశారు.
ప్రజలకు సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
నేడు (నవంబర్ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు.
ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయసూచిక -గవర్నర్ విశ్వభూషణ్
అమరావతి: ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.