టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల..

తిరుమల: డిసెంబరు 27 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం పాలక మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆస్తులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
టీటీడీకి దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉండగా.. 8,088 ఎకరాల స్థలాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.. ఇక, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. నడకమార్గంలో ఉన్న గోపురాలకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ బస్సుల స్థానంలో 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. ఇక, పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనంను తయారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు రూ.29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ పనులు చేయనున్నారు. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు పునఃప్రారంభిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
‘‘భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను అమ్మడానికి వీలు లేకుండా శ్వేత పత్రం విడుదల చేశాం. తిరుమలలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్ గా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించాం. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్ కోసం తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో పేదల వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. జాతీయ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నామని’’ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.