టోల్ గేట్ ఎత్తివేయాలి…
ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

మండపేట:- మండపేట బైపాస్ రోడ్ లో ఉన్న టోల్ గేట్ ను ఎత్తి వేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండపేట టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపేట బైపాస్ రోడ్డు నిర్మించి పద్దెనిమిదేళ్లు పూర్తయిందన్నారు. 2021 జనవరి నాటికి గడువు ముగుస్తుందన్నారు. కాగా తిరిగి టోల్ వసూలు చేసుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్ అనుమతిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గత 18 ఏళ్లుగా ప్రజలు వ్యయభారం మోస్తూనే ఉన్నారన్నారు. పక్కనే ఉన్న రామచంద్రపురం బైపాస్ రోడ్డు కు ఎలాంటి రుసుము లేదని గుర్తు చేశారు. అదేవిధంగా మండపేట, తాపేశ్వరం మీదుగా నిర్మించే బైపాస్ రోడ్డు కూడా టోల్ గేట్ లేదన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ద్వారపూడి యానాం రోడ్ నిర్మాణం కు ప్రభుత్వం రూ25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండపేటలో వంద పడకల ఆసుపత్రి కోసం వేర్ హౌస్ స్థలాన్ని ప్రభుత్వం సేకరించిందని ఇందుకు సహకరించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కాకినాడ లో నిర్వహించిన డిఆర్సి సమావేశంలో విజ్ఞప్తి చేశానని తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్ల దుస్థితి వివరించారు.తక్షణమే రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.తాపేశ్వరం బైపాస్ రోడ్డు కు సంబంధించి స్థల సేకరణ పూర్తికాగా పనులు ఇంకా ప్రారంభించలేదన్నారు. పనులు చేపట్టి పూర్తిచేయాలని కోరారు. మారేడుబాక బైపాస్ రోడ్డు నిధులు రి సెన్షన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలకు పంటచేలు మునిగిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నియోజకవర్గంలోని అన్ని మేజర్, మైనర్ డ్రైన్ లు ఆధునీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2019 ఆగస్టు 22న కాకినాడలో జరిగిన డిఆర్సి సమావేశంలో రాయవరం లో రైతు బజార్ ఏర్పాటు చేయాలని తాను కోరానని చెప్పారు. ఆ సమావేశంలో 2019 డిసెంబర్ లోపు రైతు బజార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఎప్పటికీ ఆ హామీ నెరవేరలేదని గుర్తు చేశారు. మండపేట రైతు బజార్ కి సంబంధించి రూ 5.50 లక్షల తో రైతు బజార్ ఫుట్ పాత్ నిర్మాణం స్టోరేజ్ , కవరింగ్ నిర్మాణాలు 2019 డిసెంబర్ లోనే పూర్తి చేస్తామని చెప్పారని ఆ పనులు కూడా తక్షణమే చేపట్టాలని కోరారు. కొత్తగా ఏర్పడే రాజమహేంద్రవరం జిల్లాలో మండపేట నియోజకవర్గ న్ని విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు కాకినాడ డిఆర్సి సమావేశంలో వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.