తిరుపతిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి

తిరుపతి (CLiC2NEWS): కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. సోమవారం రాత్రి 8:15 నుంచి 8:30 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు తెలిపారు. శ్రీపెరంబదూర్‌ నుంచి దవాఖానకు చేరుకోవాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. దవాఖాన వైద్యులు, సిబ్బంది హుటాహుటిన ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించారని.. దీంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఆక్సిజన్‌ అందకపోవడంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి ఆయ్యారు. దీంతో శ్వాస అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నంచేశారు. వైద్యులతోపాటు రోగుల బంధువులు ఎంతగా ప్రయత్నించినా పరిస్థితి తీవ్రంగా ఉన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రుయా ఘటనపై ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.