తెలుగు తేజం: డాక్టర్ రేమెళ్ళ అవధానులు
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. అంత గొప్ప భారత దేశంలో వేదాలు, పురాణాలు ఇలా ఎంతో గొప్పసాహిత్యం ఉంది. కాగా అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని డాక్టర్ రేమెళ్ళ అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్యరూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించారు. ఈయన భారతదేశ వ్యాప్తంగా తెలుగు భాషకు గొప్ప సేవ చేశారు. ఈయన కృషితోనే నేడు మనం కంప్యూటర్ లో అక్షరాలను చూడగలుగుతున్నాము. తెలుగు భాష విశ్వవ్యాప్తికి కృషి చేసిన మన `తెలుగు తేజం` డాక్టర్ రేమెళ్ళ అవధానులు గురించి తెలుసుకుందాం.
బాల్యం, విద్యాభ్యాసంః
అవధానులు తూర్పుగోదావరి జిల్లాలోని పొడగట్లపల్లిలొ సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు .25 సెప్టెంబరు 1948 తేదీన జన్మించారు. 1969 లో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసారు. రాజోలు డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవారు.
ఉద్యోగంః
హైదరాబాద్‌లోని ఇ.సి.ఐ.ఎల్. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో కంపెనీలో 1971లో ఉద్యోగం రావడంతో ఆయన మకాం హైదరబాద్‌కు మార్చారు. ఆ కంపెనీ శిక్షణ కాలంలోనే ఆయనకు ప్రాచీన గ్రంథాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ సమయంలో ఆయన తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించారు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్యరూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించారు.
కంప్యూటరులోకి తెలుగు
మనం కంప్యూటర్లో ఇంత సౌలభ్యంగా తెలుగు మరియు ఇతర భారీతయ భాషలు వాడుకుంటున్నామంటే 1976లో అవధానులు గారు చేసిన కృషే కారణం. మొట్టమొదట తెలుగు భాషను కంప్యూటరీకించిన వ్యక్తి అవధానులు. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరులో ప్రవేశపెట్టారు. భారతదేశంలొ కంప్యూటరులోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి అభినందనలతో కంప్యూటరులో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరులోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమపై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడా కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.
అవధానులకు హైదరాబాదు లోని నిమ్స్ డైరెక్టరు కాకర్ల సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు నిమ్స్ ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పనిచేశారు. నిమ్స్ లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్థించింది అవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే…. వేదాల గురించి ఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడా అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థమయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే…. కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్రలో ఒకాయన ఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టారు.
వేదాలలో సైన్స్, లెక్కలు, వైద్యం, అంతరిక్షశాస్త్రం మొదలగు శాస్త్రాలన్నీ కనబడ్డాయి అవధానికి. ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు చూపించారు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించి ప్రశంసించారు. ఆ విధంగా అవధాని చిరకాలకోరిక కొంతవరకైనా నెరవేరింది. వేదభారతి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు. అందుకు అవధాని ఒక్కనితో అది సాధ్యమయ్యే పనికాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూతనిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారు అవదాని. ఆవిధంగా మన వేదవిజ్ఞానాన్ని పరిరక్షించుకున్న వాళ్ళమౌతాము.
పరమాణు భౌతికశాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో ‘మీమాంస ‘ శాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం చేశారు. అదే విధంగా వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిషం అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశారు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, సంస్కృతమిత్ర బిరుదుతో సత్కరించింది.
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎంయస్ సి చేసిన ఆయన తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో `మీమాంస` శాస్త్రం నేర్చకున్నారు. ఆ తర్వాత ఎం.ఎ సంస్కృతం, జ్యోతిషం చేశారు. అదే విధంగా వేదాల్లో సైన్యు-భూకంపాలు-జ్యోతిషం అనే అంశాల మీద పిహెచ్‌డిలు చేశారు.
-టి.వి.గోవిందరావు