తెలుగు రాష్ట్రాల‌కు చేరిన కొవిడ్ టీకా

హైద‌రాబాద్ : ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్ టీకా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చేరింది. కరోనా టీకా మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్ర‌క్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. 6.5 ల‌క్ష‌ల డోసుల కొవిడ్‌ టీకాలు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో తెలంగాణ‌ రాష్ర్టానికి చేరుకున్నాయి.
మ‌రికాసేప‌ట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి టీకా డోసుల‌ను త‌ర‌లించ‌నున్నారు. కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో 40 క్యూబిక్ మీట‌ర్ల వ్యాక్సిన్ కూల‌ర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం కానుంది. రాష్ర్ట వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను త‌ర‌లించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయ‌నున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో..

కోవిషీల్డ్‌ తరలించడానికి ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరంలోని రాష్ట్ర శీతలీకరణ కేంద్రంలో భద్రపరిచి.. రేపు అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్‌ డెలివరీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద కూలర్లు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. ఈనెల 16న వ్యాక్సినేషన్‌కు వైద్య అధికారుల ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.