తొలి టీకా వేయించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు

లండన్: ప‌్రపంచంలోనే కొవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రటన్‌కు చెందిన 90 ఏళ్ల బామ్మ నిలిచారు. యుకె లో ఫైజర్ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో 90 ఏళ్ల మార్గరెట్ కీసన్ తొలి టీకా వేయించుకున్నారు. దీంతో ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ టీకాను ప్రపంచంలోనే తొలిసారి తీసుకున్నట్లు వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. ఈ ప్రక్రియతో బ్రిటన్‌లో సామూహిక స్థాయిలో వ్యాక్సినేషన్ మొదలైనట్లే. మార్గరేట్ కీనన్ వచ్చే వారంలో 91 ఏళ్లకు ఎంటర్ కానున్నది. ఈ టీకాను తనకు బర్త్‌డే ప్రజెంటేషన్‌గా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
బ్రిటన్ దేశ వ్యాప్తంగా తొలుత 80 ఏళ్లు దాటిన వారికి ఇవ్వనున్నారు. వారితో పాటు ఆరోగ్య, కేర్ సిబ్బందికి కూడా టీకాను పంపిణీ చేయనున్నారు. కోవిడ్‌కు గురయ్యే వారికి ముందు టీకా ఇవ్వాలని ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. కోవెంట్రీని యూనివర్సిటీ హాస్పిట్‌ల్‌లో కీనన్ బామ్మకు టీకా ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోగా 40 లక్షల మందికి టీకాను ఇవ్వాలని బ్రిటన్ భావిస్తున్నది. ఫైజర్ టీకాను అనుమతి ఇచ్చి, దాన్ని వాడుతున్న తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. అయితే వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు అంటూ కూడా ప్రభుత్వం పేర్కొన్నది. ఫైజర్-బయోఎన్‌టెక్‌కు చెందిన సుమారు 8 లక్షల డోసులను బ్రిటన్ ప్రభుత్వం కొన్ని వారాల్లో పంపిణీ చేయనున్నది. మొత్తం నాలుగు కోట్ల టీకాల కోసం ఆర్డర్ చేసింది బ్రటన్. అయితే ఈ టీకాలు సుమారు రెండు కోట్ల మందికి సరిపోనున్నాయి. ఎందుకంటే టీకాను రెండు డోసుల్లో తీసుకోనున్నారు.
యూకేతో పాటు ఫైజర్ అమెరికాలో కూడా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం 10న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ యుఎస్‌లో కూడా అనుమతి లభిస్తే డిసెంబరు మూడోవారం నుంచి అగ్రరాజ్యంలో టీకా పంపిణీ చేయాలని ఫైజర్ భావిస్తోంది. అటు భారత్‌లోనూ టీకా అనుమతి కోసం ఫైజర్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.