తమిళనాడులో డిసెంబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
చెన్నై: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో డిసెంబర్ 31 వరకు లాక్‌డౌన్‌ను పొడగించారు. కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆంక్షలను సడలించారు. బీచ్‌ల సందర్శన కోసం ప్రజలకు అనుమతించారు. యూజీ, పీజీ కాలేజీలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చారు. కోవిడ్ నియమావళి పాటించాల్సి ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది. క్రీడా శిక్షణ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 14 నుంచి మెరీనా బీచ్‌ను విజిట్ చేసేందుకు అనుమతి కల్పించారు. ప్రస్తుతం చెన్నైలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్స్ సంఖ్య పెరుగుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నది.