దసరా నాడే ధరణి
బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ః దసరా పండుగ నాడు ధరణి పోర్టల్ ప్రారంభం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో భూ సర్వే నేపథ్యంలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల ప్రజా ప్రతినిధులతో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా వ్యాప్తంగా భూ సమస్యలు లేకుండా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల స్పష్టం చేశారు. తెలంగాణా మీద ఉన్న భూభాగం మొత్తం రికార్డు చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ రూపుదిద్దుకోనుందని, నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రజాప్రతినిధులకు తెలియచేసేందుకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. భూసర్వేకు సంబంధించి, నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు అందరూ సమగ్ర అవగాహన కల్పించుకోవాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా తెల్సుకొనేందుకే సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నామని తెలిపారు. తెలంగాణా వ్యాప్తంగా రెండు కోట్ల 77 లక్షల ఎకరాల భూమి ఉందని ఇదంతా ధరణి పోర్టల్ లో రికార్డు కావాల్సిందేనని ఆయన అన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూమలు అన్నీ నమోదు చేస్తామని ఒక్కసారి నమోదు చేసిన తర్వాత పేరు మార్పిడికి తప్ప ఇతర అంశాలకు తావు ఉండదని ఆయన తెలిపారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భూములు నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఒక్క క్లిక్ ద్వారా భూముల వివరాలు తెల్సుకోవచ్చని మంత్రి చెప్పారు. ఎలాంటి టాంపరింగుకు అవకాశం లేని విధంగా ధరణి పోర్టల్ రూపొందుతోందని మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రజలకు సమాచారం అందించి అన్ని భూముల వివరాలు నమోదు అయ్యేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. గత వ్యవస్థలో భూములకు సంబంధించిన వివాదాలే ఎక్కువగా ఉండేవని, వాటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే నూతన రెవెన్యూ చట్టమని మంత్రి అన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా… వారికి ఉపయోగపడే విధంగా చట్టాలు ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. అన్నదాతల మేలు కోరి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి ఆస్తులను నమోదు చేయించుకునే కనీస బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. పేదల పక్షాన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ప్రజా అనుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదలపై ఎలాంటి ఆర్థిక భారం పడని విధంగానే నూతన చట్టం నియమ నిబంధనలు ఉంటాయని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తోపాటు… ఆర్డీవో ఆనంద్ కుమార్, డి.పి.వో. వీర బుచ్చయ్య, ఎంపీపీలు పిల్లి శ్రీలత-మహేశ్, తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీలు పిట్టల కరుణ, పురుమల్ల లలిత, ప్యాక్స్ ఛైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, తహసీల్దార్లు, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొ న్నారు.