దెందులూరులో చిన్నారుల అదృశ్యం!

దెందులూరు: ప.గో. జిల్లా దెందులూరు మండలంలో ఇద్దరు చిన్నారుల అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. మండలంలోని గాలాయగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా స్థానికంగా 6వ తరగతి చదువుతున్న యశ్వంత్ (12), 5వ తరగతి చదువుతున్న అభి(10) శనివారం సాయంత్రం సైకిలుపై ఇంటి నుంచి వెళ్లారు. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాగా ఈ పిల్లలు ఇద్దరూ అన్నాదమ్ముల పిల్లలు. యశ్వంత్ తండ్రి సురేశ్, అభి తండ్రి అగస్తిన్ ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.