దేశంలో కొత్తగా 31 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిస్తూనే ఉన్నారు. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం తప్పనిసరి అంటున్నారు. కాగా నిన్న 32,080 కేసులు నమోదవగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇందులో 92,53,306 మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,72,293కు తగ్గింది. ఒకేరోజు 37,725 మంది కొత్తగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 412 మంది మరణించారు. దీంతో కరోనా మృతులు 1,41,772కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు సెప్టెంబర్ నెల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 18న 10 లక్షలుగా ఉన్న యాక్టివ్ కేసులు అక్టోబర్ 8 నాటికి 9 లక్షలకు పడిపోయాయి. యాక్టివ్ కేసుల సంఖ్య అక్టోబర్ 16 నాటికి 8 లక్షలకు, వారం వ్యవధిలో అంటే అక్టోబర్ 22 వరకు 7 లక్షలకు, అక్టోబర్ 29 నాటికి 6 లక్షలకు, నవంబర్ 10 నాటికి 5 లక్షలకు, డిసెంబర్ 6 నాటికి 4 లక్షల దిగువకు పడిపోయాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.