ధరణి పోర్టల్‌పై విచారణ.. స్టే పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై రేపటి (గురువారం) వరకు స్టే పొడిగించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో హైకోర్టుకు ప్రభుత్వం చెప్పినప్పటికీ అది అమలు కావడం లేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది దేశాయి ప్రకాష్ కోర్టులో వాదనలు వినిపించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై వ్యక్తి గత వివరాలతో పాటు కొనుగోలు దారులు, అమ్మకం దారుల కుటుంబ సభ్యుల వివరాలపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డ్ వివరాలు తీసుకోవద్దని గతంలో చెప్పినప్పటికీ ప్రభుత్వం వివరాలు సేకరిస్తుందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ప్రభుత్వం కోర్టుకు చెపుతోంది ఒకటి అయితే, బయట చేస్తుంది మరొకటి అని ఉన్నతన్యాయస్థానం అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని కోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.