నివర్ తుఫాను హెచ్చరికతో ఎపి సర్కార్ హై అలెర్ట్!

అమరావతి: బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. చెన్నైకి 630 కిలోమీర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగేయంగా 600కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి రేపు ఉదయానికి తుపానుగా మారనుంది. దీంతో రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణాలో వర్షాలు కురవనున్నాయి. ఈనెల 25న కరైకాల్-మమల్లా పురం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. నివర్ తుఫాను ఏర్పడనుండటంతో ప్రభుత్వం అలెర్టయింది. ఈ తుఫాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట సహా మినుము, పత్తి, సన్ ఫ్లవర్ తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పంట కోతలు వీలైనంత త్వరగా చేపట్టాలని రైతులకు హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. అలానే వైద్య బృందాలను కూడా సిద్ధం వైద్యారోగ్యశాఖ చేసుకుంటుంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలి అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంబులెన్సులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు సూచనలు చేశారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు తుపానుతో తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.