నేడు మున్సిపల్ ఎన్నికల ఫ‌లితాలు..

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పురపాలక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేడు (ఆదివారం) తెరపడనుంది. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మార్చి 10 వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 71 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడబోతున్నాయి. కార్పొరేషన్లలో 2204, మున్సిపాలిటీల్లో 1822 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 20,419 మంది పోలీసులతో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 70 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. రాత్రి 8 గంటలలోగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్.ఇ.సి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Leave A Reply

Your email address will not be published.