పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల మధ్య మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతా ప్రత్యేక రైళ్లు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణీకుల సౌకర్యార్ధం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జోన్ల వారీగా రైళ్ల సంఖ్యను ఇండియన్ రైల్వేస్ పెంచుతూ వస్తోంది.
తాజాగా డిసెంబర్ 1 నుంచి లింగంపల్లి- కాకినాడ టౌన్ మధ్య ట్రైవీక్లీ రైలు నడవనుంది. లింగంపల్లిలో (సోమవారం, బుధవారం, శుక్రవారం) రాత్రి 7 గంటలకు బయల్దేరనున్న ఈ రైలు మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. అలాగే కాకినాడలో (మంగళవారం, గురువారం, ఆదివారం) రాత్రి 8 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 7.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. అటు విజయవాడ-చెన్నై మధ్య నడిచే పినాకిని ఎక్స్‌ప్రెస్ కూడా రేపట్నుంచి ప్రతీ రోజూ పరుగులు పెట్టనుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇక విజయవాడ-లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయిస్ ట్రైన్) డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక రేపటి నుంచి సికింద్రాబాద్-హావ్‌డా-సికింద్రాబాద్ (నం.02702/02705), విజయవాడ-ఎంజీఆర్ చెన్నైసెంట్రల్-విజయవాడ (నం.02711/02712), విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ(నం.02718/02717), సికింద్రాబాద్-శాలిమార్-సికింద్రాబాద్ (నం.02774/02773) రైళ్ల సమయాల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.