పెళ్లి ఇంట్లో చోరీ: భారీ ఎత్తున బంగారం, నగదు అపహరణ..
మిడ్జిల్: మహబూబ్ నగర్ జిల్లాలో పెళ్లి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. జిల్లాలోని మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో ఒక ఇంట్లో సుమారు 200 తులాల బంగారు నగలు, ఎనిమిది లక్షల రూపాయల నగదు అపహరణకు గురైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. కూతురి వివాహం కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబసభ్యుల ఆభరణాలు దొంగిలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. పొద్దున్నే నిద్రలేచి చూసే సరికి దొంగలు ఇల్లు మొత్తం గుల్ల చేశారు. ఆ తర్వాత లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. ఇది తెలిసినవారి పనా? లేక నిజంగానే దొంగలు పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.