బండి సంజ‌య్‌కు మంత్రి హ‌రీష్ రావు స‌వాల్‌

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌పై ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అబ‌ద్దాలు చెప్పి రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని బీజేపీ నాయ‌కులు చూస్తున్నారు. అది ప్ర‌జాస్వామ్యానికి అంత మంచిది కాద‌ని మంత్రి సూచించారు. మంత్రి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. బీడీ కార్మికుల‌కు ఇచ్చే పెన్ష‌న్‌లో కేంద్రమే రూ. 1600 ఇస్తుంద‌ని, రాష్ర్టం కేవ‌లం రూ. 400 ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు. బీడీ కార్మికుల‌కు కేంద్రం 16 పైస‌లు కూడా ఇవ్వ‌డం లేద‌ని హ‌రీష్ రావు తేల్చిచెప్పారు. ఇవ‌న్నీ నిజ‌మే అయితే.. చ‌ర్చ‌కు సిద్ధంగా ఉండాల‌ని బండి సంజ‌య్‌కు హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు. దుబ్బాక పాత బ‌స్టాండ్ వ‌ద్ద ప్ర‌జ‌ల మ‌ధ్యే చ‌ర్చ పెడుదామ‌న్నారు. ఒక వేళ బీడీ కార్మికుల‌కు కేంద్రం రూ. 1600 పెన్ష‌న్లు ఇస్తున్న‌ట్లు నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి ప‌ద‌వికి, సిద్దిపేట ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఒక వేళ నిరూపించ‌క‌పోతే బండి సంజ‌య్ అదే పాత బ‌స్టాండ్ వ‌ద్ద ముక్కు నేల‌కు రాస్తాడా? అని హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు. దీనికి సిద్ధ‌మనుకుంటే.. బీజేపీ నాయ‌కులే తేదీని డిసైడ్ చేయాల‌న్నారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఇదే విధంగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో చపాతీ మేకర్ గుర్తు ఉన్న అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో అదే విధమైన గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని, హుజూర్‌నగర్‌లో బీజేపీకి జరిగిన పరాభవమే దుబ్బాకలో జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులకు నిజమైన చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, రాజ్యాంగ బద్దంగా, హక్కుగా రావాల్సిన పన్ను బకాయిలను రప్పించాలన్నారు. అంతే తప్ప అబద్ధపు, అసత్యపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. దుబ్బాక ప్రజలను ముమ్మాటికీ మీ మాటను నమ్మరని, బీజేపీకి హుజూర్‌నగర్‌, నిజామాబాద్‌లో ఎదురైన ఫలితమే దుబ్బాకలో పునరావృతం కానుందని హరీశ్‌రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.