బండి సంజ‌య్ నోరు అదుపులో పెట్టుకో : ‌బాల్క సుమ‌న్

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ హెచ్చ‌రించారు.
తెలంగాణ భ‌వ‌న్‌లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాని మోదీని సీఎం కేసీఆర్ ఇప్పుడేం కొత్త‌గా క‌ల‌వ‌లేదు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత అనేక సంద‌ర్భాల్లో ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల‌ను సీఎం కేసీఆర్ క‌లిశారు. ఆ సంద‌ర్భంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బ‌కాయిలు, రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా వంటి అంశాల‌పై చ‌ర్చించార‌ని గుర్తు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌ర్య‌ట‌న కూడా రాష్ర్టానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పైనే అని బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్ట‌, కేంద్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య సంబంధాలు అనేకం ఉంటాయి.. వాటిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లార‌ని తెలిపారు. ఈ విష‌యం కూడా తెలియ‌ని ఎంపీ బండి సంజ‌య్ సోయి లేకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. ప్ర‌జ‌ల‌కు కూడా వాస్త‌వాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్.. ఆయన గురించి మాట్లాడే ముందు బండి సంజ‌య్‌ ఆచీ తూచి మాట్లాడాలి. స్థాయి లేని వాళ్లంతా.. కేటీఆర్ గురించి మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు.

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారు.. అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. త‌మ పార్టీ నాయ‌క‌త్వం, కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవ‌గాహ‌న పెంచుకొని మాట్లాడాల‌ని సూచించారు. లేని ప‌క్షంలో తెలంగాణ ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌ని సుమ‌న్ అన్నారు. రాజ్యాంగ బ‌ద్ధ వ్య‌వ‌స్థ‌ల‌పై సంజ‌య్ అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రిని సీఎంలు క‌ల‌వ‌డం సాధార‌ణ‌మ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.