బిహార్ సీఎంగా 7వ సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్

హైద‌రాబాద్‌: బీహార్ సీఎంగా నితీశ్ కుమార్‌.. ఇవాళ(సోమ‌వారం) ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది ఏడో సారి. అయితే వ‌రుస‌గా నాలుగో సారి ఆయ‌న జేడీయూ చీఫ్‌గా సీఎం బాధ్య‌త‌లను స్వీక‌రించారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. ఎన్డీఏ కూట‌మి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. బీహార్ సీఎం అభ్య‌ర్థిగా ఏన్డీఏ కూట‌మి త‌ర‌పున నితీశ్ కుమార్ పోటీ చేశారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ ఫాగూ చౌహాన్ .. నితీశ్ కుమార్‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. బీజేపీ నేత‌లు తార్‌కిషోర్ ప్ర‌సాద్‌, రేణు దేవీలు.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంలుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌లు .. నితీశ్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. నితీశ్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వాన్ని ఆర్జేడీ పార్టీ బాయ్‌కాట్ చేసింది. జేడీయూ నేత‌లు విజ‌య్ కుమార్ చౌద‌రీ, విజేంద్ర ప్ర‌సాద్ యాద‌వ్‌, అశోక్ చౌద‌రీ, మేవా లాల్ చౌద‌రీలు.. క్యాబినెట్ మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

15 ఏళ్లుగా బిహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న నితీష్, తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముందుగా చెప్పినట్లుగానే నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మాట నిలబెట్టుకున్నారు.

నవంబర్ 10న వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటితో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఎక్కువ స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ స్థానాలను అందుకోలేకపోయింది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు కావాలి. కాగా, ఎన్డీయే 125 స్థానాలు గెలచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసుకుంది.

 

Leave A Reply

Your email address will not be published.