బీర్ల అమ్మకాల్లో గత రికార్డులు బ్రేక్‌!

ఎండ‌ల ఎఫెక్ట్‌.. తెగ అమ్ముడు పోతున్న బీర్లు..

హైదరాబాద్‌: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌తో ప్ర‌జ‌లు చ‌ల్ల‌ని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మందుబాబులు మాత్రం ఎండ‌వేడికి ఉప‌శ‌మ‌నం కోసం చ‌ల్ల‌టి బీర్ల‌నే తాగేస్తున్నారు. దాంతో ప్రస్తుతం తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎంత‌లా అంటే గ‌త ఏడాది అమ్మ‌కాల రికార్డును బ‌ద్ద‌లు కొడుతున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో గతేడాది మార్చిలో 26.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలయితే.. ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగడం గమనార్హం. మే నెలలో భారీ స్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగే అవకాశం ఉండొచ్చని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరిలో రూ.2727.15 కోట్లు, ఫిబ్రవరిలో రూ.2,331.65 కోట్లు, మార్చి నెలలో రూ.2,473.89 కోట్లు కలిపి మొత్తంగా రూ.7,532.69 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా 2020 నుండి 2021లో రూ.27,288.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్‌ కేసులు, 2.7 కోట్ల బీర్‌ కేసులు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన చూస్తే రోజుకు సగటున మందుబాబులు 90 వేలకు పైగా ఐఎంఎల్‌, 74 వేలకు పైగా బీర్‌ కేసులు తాగేస్తున్నారన్నమాట!

Leave A Reply

Your email address will not be published.