బడిలో కరోనా.. జగిత్యాలలో 15, సిరిసిల్లలో 15 మంది బాలికలకు కొవిడ్
జగిత్యాల: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. తాజాగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రెండు బాలికల గురుకుల పాఠశాలల్లో కలిపి 30 మందికి కరోనా సోకింది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థులలో పలువురికి జ్వరం రావడంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా.. 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని కస్తూర్భగాంధీ బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇక్కడ 62 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 15 మంది బాలికలు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయినట్లు మండల వైద్యాధికారి మోహనకృష్ణ తెలిపారు.