భద్రాద్రి రామాలయంలో నేటి నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

హైదరాబాద్‌ : ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రారంభంకానున్నాయి. భదాద్రిలో సీతారాముల కల్యాణం అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలు నేటితో ప్రారంభమై జనవరి 4వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు పగలు ఉత్సవాలు, 25 నుంచి జనవరి 4వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు జరుగనున్నాయి. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు విలాసోత్సవాలు, జనవరి 10వ తేదీన స్వామివారికి విశ్వరూప సేవ జరుగనుంది. మంగళవారం నుంచి భదాద్రి సీతారాముడు రోజుకో రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు. అలంకారాల దర్శనం కోసం చిత్రకూట మండపం సిద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు స్వామి వారు మత్స్యావతారంలో కనిపించనున్నారు. బుధవారం కూర్మావతారం, 17న వరహావతారం, 18న నరసింహావతారం, 19న వామనవతారం, 20న పరశురామవతారం, 21న శ్రీరామవతారం, 22న బలరామావతారం, 23న శ్రీ కృష్ణావతారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 25న ఉదయం 5గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులను అనుగ్రహించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.