భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఆవుదూడపై పులి దాడి!

టేకులపల్లి: తెలంగాణ‌ రాష్ట్రంలో పెద్ద‌పులి ఈ మధ్య కాలంలో ఏదో ఒక జిల్లాలో క‌నిపిస్తూనే ఉంది. తాజాగా పాకలో ఉన్న పశువులపై పెద్దపులి దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామ పంచాయతీ రాజుతండా గ్రామానికి చెందిన భూక్య కాన్య అనే రైతుకు గుండ్లమడుగు గ్రామ సమీపంలో వేరుశనగ చేను ఉంది. అతడు తన చేను వద్ద కాపాల ఉంటున్నాడు. అక్కడే పశువుల కొట్టాన్ని కూడా ఏర్పాటుచేసుకొని అందులోనే పశువులను కూడా ఉంచుతున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి కూడా కాపలా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పశువుల కొట్టంలో అలికిడి రావడం, అరుపులు విన్పించడంతో కాన్య వెళ్లాడు. ఆవు దూడపై పెద్దపులి దాడి చేస్తున్న ఘటన చూశాడు. పక్కనే ఉన్న మాడ్డె రాంబాబుకు విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి పెద్దగా అరుస్తూ కేకలు వేయడంతో ఆవుదూడని వదిలి పులి పారిపోయింది. అనంతరం వారు పశువుల కొట్టంలోకి వెళ్లి చూడగా ఆవుదూడ మెడకు గాయం కన్పించింది. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. పులి సంచరిస్తున్నందున అటవీ సమీపాన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లొద్దని, పశువులను ఆరు బయట కట్టేయొవద్దని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.