మాజీ మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు!
ఖమ్మం: నూతన సంవత్సంరం (2021) సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో తనను కలిసిన పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రకృతి వల్ల ఇబ్బందులు పడ్డాం అని అన్నారు. సీఎం కేసీఆర్ కు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మిషిన్ భగీరథ, ఇతర పథకాలను విజయవంతంగా ఉపయోగించుకున్నామన్నారు. అయితే, స్వార్ధపరులు, అధికారం కోసం అర్రులు చాచినవాళ్లు మనలను ఓడించారంటూ హాట్ కామెంట్లు చేశారు. ఇక రాజకీయాల్లో ఆటుపోట్లు, గెలుపు ఓటములు ఉంటాయని అన్నారు. ఓటమి గురించి ఆలోచించకుండా రాజకీయాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక పోతే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కుంటు పడ్డాయని, వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా సూచించారు.