మీ శ్రేయస్సు దృష్ట్యా తిరుపతి సభకు రాలేకపోతున్నా..
తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ
అమరావతి: తిరుపతి ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకుంటున్నట్లు ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు.
“ ఈ నెల 14న బహిరంగ సభకు వచ్చి తిరుపతి నెల్లూరు ప్రజల ఆత్మీయత, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని అనుకున్నాను. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే సభ రద్దు చేయడమే మేలు అనిపించింది. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా.
మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా.గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డా.గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నానని“ లేఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.