మ‌రో 43 మొబైల్ యాప్‌ల‌పై కేంద్రం బ్యాన్‌

చైనాకు భారత్ మళ్లీ ఝలక్..

ఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో స‌మాచార గోప్య‌త దృష్ట్యా ఇప్ప‌టికే 177 యాప్‌ల‌పై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా మ‌రికొన్ని యాప్‌ల‌పై కొర‌డా ఝులిపించింది. చైనాకు చెందిన మరికొన్నిఅప్లికేషన్లను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బ్యాన్ చేసిన యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి. ఐటీ సెక్షన్ 69ఏ ప్రకారం ఈ బ్యాన్ విధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ బ్యాన్ విధించడానికి గల కారణాలను కేంద్రం వెల్లడించింది. భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉందని, అలాగే రక్షణరంగ, కేంద్ర-రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా ఈ అప్లికేషన్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది.

ఇప్పటికే చైనాకు చెందిన వందకు పైగా మొబైల్ అప్లికేషన్లను కేంద్ర సర్కార్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తొలిసారి యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ వంటి 59 యాప్స్‌పై కేంద్ర బ్యాన్ విధించింది. ఆ తరువాత రెండో విడతగా పాపులర్ గేమ్ పబ్‌జీతో సహా మొత్తం 118 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఇక ఇప్పుడు మరో 43 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఈ సారి బ్యాన్ చేసిన యాప్స్‌లో కొద్ది సంఖ్యలో ఇతర దేశాలకు చెందిన యాప్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో అత్యధికంగా డేటింగ్ యాప్స్ ఉండడం గమనార్హం. తాజా బ్యాన్‌తో మొత్తం ఇండియా బ్యాన్ చేసిన చైనీస్ అప్లికేషన్ల సంఖ్య 200 దాటేసింది.

Leave A Reply

Your email address will not be published.