యెమెన్‌లో ఉగ్రవాదుల దాడి.. మంత్రి సహా 30 మంది మృతి

యెమెన్‌ : యెమెన్‌లోని అడెన్‌ విమానాశ్రయంలో బుధవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. నూతనంగా ఎన్నికైన ప్రధాని మొయిన్‌ అబ్దుల్‌ మాలిక్‌, అతని మంత్రివర్గంతో ప్రయాణిస్తున్న విమానం అడెన్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ప్రధానికి, మంత్రి వర్గానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని ఫ్లైట్‌ నుండి కిందకిదిగిన వెంటనే దుండగులు బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. శక్తివంతమైన బాంబు పేలుళ్లతో పబ్లిక్‌ వర్క్‌ డిప్యూటీ మంత్రితో పాటు 30 మంది మృత్యువాత పడగా, 60 మందికి గాయాలయ్యాయని అల్‌-మస్దార్‌- మీడియా తెలిపింది. అనంతరం ప్రధానిని సురక్షితంగా అక్కడి నుండి తరలించారు. ఇరాన్‌ మద్దతు గల హౌతి తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.