రెండ్రోజులైనా ఆరని మంటలు

ముంబయి : ముంబయిలోని ఒక వాణిజ్య భవనంలో జరిగిన ఆగ్రిప్రమాదన్ని గత రెండురోజులు మంటలార్పుతూనే ఉన్నారు. ముంబయిలోని ఒక వాణిజ్య భవనంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి 40 గంటలైనా మంటలు ఆరలేదని ఫైర్ అధికారులు తెలిపారు. ఇంకా మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు రోజులుగా అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నారని అన్నారు. మంటలను ఆర్పే యత్నంలో సోమవారం ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయని చెప్పారు. వివరాల ప్రకారం.. దక్షిణ ముంబయిలోని గృహ సంబంధిత వస్తువులైన కత్తులు, ఇనుప సామాగ్రి విక్రయించే మార్కెట్లోని మూడంతస్థుల భవనంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. తొలుత లెవల్ -3 (మేజర్) ప్రమాదమని చెప్పారని, అనంతరం లెవల్-4కు (భారీ) ప్రమాదానికి దారి తీసిందని అన్నారు. 17 అగ్నిమాపక యంత్రాలు, భారీ వాటర్ టాంకర్స్తో పాటు భారీ ఎత్తున సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. కాగా, ప్రమాదానికి గల కారణం ఇప్పటికీ తెలియరాలేదని చెప్పారు. 2012 రాష్ట్ర సచివాలయంలో జరిగిన ప్రమాదం అనంతరం ఇంతటి భారీ అగ్ని ప్రమాదం జరగడం ఇదే మొదటిసారని ఉన్నతాధికారులు తెలిపారు.