రైతు దీక్షలకు మద్దతు: సింగర్ కోటి సాయం

న్యూఢిల్లీ : మోడీ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని హస్తినలో రైతులు చేపట్టిన దీక్షలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నెల 8న తలపెట్టన భారత్ బంద్‌కు ఇప్పటికే విపక్ష పార్టీతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం మద్దతు ప్రకటించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు ప్రకటించారు. కాగా గత పదిరోజులుగా ఢిల్లీ నడిరోడ్డుపై చలిలో దీక్షలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నారు.న్యాయబద్ధమైన రైతుల డిమాండ్స్‌ను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు అండగా బియ్యం, దుస్తులు, కూరగాయలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించిన పంజాబ్ నటుడు, ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్ మరోసారి వారికి అండగా నిలిచారు. చలిలో గత పదిరోజులుగా నిరసన తెలుపుతున్న రైతులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. రైతులకు మద్దతుగా ప్రజాసంఘాలు, నాయకులు ముందుకు రావాలని కోరారు.