రోజుకు 24 స్లాట్లు మాత్రమే: సోమేశ్ కుమార్
స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించిన సిఎస్
హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూతనంగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఈ విధానంలో రిజిస్ట్రార్లు సహా అధికారులెవరికీ ఎలాంటి విచక్షణాధికారులు ఉండవని సిఎస్ అన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ల బుకింగ్ జరగనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ లేనివారి విషయంలో కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు.
ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్లో వార్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాల్ సెంటర్ 18005994788 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఈ-పాస్‌బుక్ ఇస్తామన్నారు. మెరూన్ రంగు పాసుపుస్తకాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో 16 లక్షల లావాదేవీల్లో 10 వేలే స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవి అన్నారు. ప్రస్తుతం వంద శాతం స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. రిజిస్ట్రార్లు సహా అధికారులు ఎవరికీ విచక్షణాధికారాలు ఉండవన్నారు.
సులువుగా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌శాఖ వెబ్సైట్ ద్వారా స్లాట్ల బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ముందుగా స్లాట్ బుకింగ్ చేయకుండా రిజిస్ట్రేషన్లు లేవన్నారు. పీటీఐఎన్ సంఖ లేనివారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అటువంటి వారికి రెండ్రోజుల్లో పీటీఐఎన్ సంఖ్య ఇస్తామన్నారు. ఆన్లైన్ లేదా చలానా ద్వారా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించొచ్చు. కొన్ని సేవలు తక్షణమే ప్రారంభం అయినట్లు తెలిపారు. అమ్మకం, గిఫ్ట్, సేల్ అగ్రిమెంట్, మార్ట్ గేజ్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ తదితరాలు చేయొచ్చు అన్నారు.
దాదాపుగా 96 శాతం సర్వీసులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. త్వరలోనే మిగతా సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఆధార్ తప్పనిసరి కాదని ఆధార్ ఇవ్వని వారికోసం వేరే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కూడా ఆన్లైన్లో వెంటనే జరుగుతుందన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. డేటాకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపిన సీఎస్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.