వరద నీటిలో రోడ్డుపైనే మహిళ ప్రసవం
గుంటూరు: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఓ వైపు వరదలు హోరెత్తుతుంటే.. ఆ వరద నీటిలో రోడ్డుపైనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం ఈపూరు లంక గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు అధికమవడతో మండల కేంద్రమైన కొల్లూరులోని వైద్యశాలకు తరలించేందుకు కుటుంబసభ్యులు బయలుదేరారు. కానీ వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ కొట్టుకుపోయి, రోడ్లపై వరద నీరు చేరింది. దీంతో ఆసుపత్రికి బయలుదేరిన ఆమెను కొల్లూరు తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వరద నీరు చేరిన రోడ్డుపై రోప్‌లు నిర్మించి నిండు గర్భిణిని తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమెకు నొప్పులు అధికమై అక్కడే వరద నీటిలోనే రోడ్డుపై మహిళ ప్రసవించింది. అనంతరం తల్లీ, బిడ్డను మంచంపై తీసుకొని కొల్లూరు ఒడ్డుకు తీసుకు వచ్చి 108లో వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ ఉజ్వల్ గొప్ప మనసును చాటుకోవడంతో స్థానికులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు.